Friday, July 6, 2018

ఇంగ్లాండ్‌దే రెండో టీ20




ఇంగ్లాండ్‌దే  రెండో టీ20 
          రాణించిన హేల్స్‌, బెయిర్‌స్టో 
                                      కార్డిఫ్‌ 





భారత్‌తో తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్‌ రెండో టీ20లో సత్తా చాటింది. హేల్స్‌ (58 నాటౌట్‌; 41 బంతుల్లో 4×4, 3×6) మెరిసిన వేళ టీమ్‌ఇండియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఆదివారం చివరి టీ20 మ్యాచ్‌ జరుగుతుంది.
ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన మోర్గాన్‌ సేన రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (47; 38 బంతుల్లో 1×4, 2×6), ధోని (32 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. హేల్స్‌, బెయిర్‌స్టో (28; 18 బంతుల్లో 2×6) మెరుపులతో ఇంగ్లాండ్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి రాగా.. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌ బాదిన హేల్స్‌ జట్టును విజయపథంలో నడిపించాడు.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టిపడేశారు. కార్డిఫ్‌ పిచ్‌పై బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో పాటు అదనపు బౌన్స్‌ కూడా ఉండడంతో పరుగుల కోసం ఆరంభంలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కష్టపడ్డారు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ (5), ధావన్‌ (10)తో పాటు తొలి మ్యాచ్‌లో సెంచరీ వీరుడు కేఎల్‌ రాహుల్‌ (6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. బాల్‌ బౌలింగ్‌లో బంతిని పుల్‌ చేయబోయి రోహిత్‌ ఔట్‌ కాగా.. ధావన్‌ చిత్రంగా రనౌట్‌ అయ్యాడు. ప్లంకెట్‌ బౌలింగ్‌ను బంతిని టచ్‌ చేసి పరుగుల కోసం ప్రయత్నించాడు శిఖర్‌. అయితే అవతలి ఎండ్‌లో క్రీజులోకి వెళ్లే క్రమంలో ధావన్‌ చేతిలో బ్యాట్‌ చేజారింది. ఈ స్థితిలో అతని కాలు గాల్లో ఉండడంతో రనౌట్‌గా వెనుదిరగక తప్పలేదు. అదే ఓవర్లో రాహుల్‌ బౌల్డ్‌ కావడంతో భారత్‌ 22/3తో కష్టాల్లో పడింది.
కోహ్లి.. రైనా జోడీగా: రైనా (27; 20 బంతుల్లో 2×4, 1×6) జోడీగా కోహ్లి భారత ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. వీలు చిక్కినప్పుడల్లా తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లు కొట్టిన విరాట్‌.. భారత రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. రషీద్‌ బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌లో రాయ్‌ క్యాచ్‌ వదిలేయడంతో జీవనదానం పొందిన అతను.. జోర్డాన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్‌ మీదగా కళ్లుచెదిరే సిక్స్‌ బాదాడు. రైనా ఔట్‌ కావడం, అర్ధసెంచరీకి చేరువైన విరాట్‌.. రూట్‌ పట్టిన మెరుపు క్యాచ్‌తో వెనుదిరగడంతో భారత్‌ 111/5తో నిలిచింది. ఆఖరి ఓవర్లో ధోని మూడు ఫోర్లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. దీంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్‌ ముగించింది.
భారత్‌: 148/5 (కోహ్లి 47, రైనా 27, ధోని 32 నాటౌట్‌, పాండ్య 12 నాటౌట్‌; విల్లీ 1/18, బాల్‌ 1/44, ప్లంకెట్‌ 1/17, రషీద్‌ 1/29)
ఇంగ్లాండ్‌: 19.4 ఓవర్లలో 149/5 (రాయ్‌ 15, బట్లర్‌ 14, హేల్స్‌ 58 నాటౌట్‌, బెయిర్‌స్టో 28; ఉమేశ్‌ 2/36, కుల్‌దీప్‌ 0/34, చాహల్‌ 1/28)

No comments:

Post a Comment

WhatsApp Reportedly Issues Fix for Chat Syncing Issue With Linked Devices

WhatsApp is reportedly implementing a security fix to address the issue where a user's chats across devices were not synced properly. Th...