Friday, July 6, 2018

ఒక్క ట్వీట్‌.. 26 మంది బాలికలకు విముక్తి

ఒక్క ట్వీట్‌.. 26 మంది బాలికలకు విముక్తి 
     రైల్లో అక్రమంగా తరలిస్తున్నారని ప్రయాణికుడి ట్వీట్‌ 
                  కాపాడిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌


దిల్లీ: రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లుగా భావిస్తున్న 26 మంది మైనర్‌ బాలికలకు.. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రైల్వే పరిరక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) విముక్తి కల్పించాయి. బాలికల తరలింపుపై ఓ ప్రయాణికుడు ట్విటర్‌ ద్వారా అప్రమత్తం చేయడంతో వారిని రక్షించాయి. ముజఫ్ఫర్‌పుర్‌ నుంచి బాంద్రాకు వెళ్తున్న అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ బాలికలు ప్రయాణించారు. వారిని అక్రమంగా తరలిస్తుండవచ్చన్న సందేహంతో ఆదర్శ్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి గురువారం రైల్వేశాఖకు ట్వీట్‌ చేశారు. ‘‘దాదాపు 25 మంది బాలికలు ఇబ్బందిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. వారిలో కొందరు రోధిస్తున్నారు. ప్రస్తుతం రైలు హరినగర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)లో ఉంది’’ అని పేర్కొన్నారు. దీనికి వారణాసి, లఖ్‌నవూల్లోని అధికారులు వెంటనే స్పందించారని.. అరగంటలోపే విచారణ చేపట్టారని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ జవాన్లు సాధారణ ప్రయాణికుల్లా కప్తాన్‌గంజ్‌లో ఆ రైలు ఎక్కారని.. గోరఖ్‌పుర్‌ వరకు బాలికలకు రక్షణగా ఉన్నారని పేర్కొన్నారు. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మొత్తం 26 మంది బాలికలను కాపాడమని.. వారి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆర్‌పీఎఫ్‌ తెలిపింది. బాధిత బాలికలు బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వారని, వారిని శిశు సంక్షేమ కమిటీకి అప్పగించామని తెలిపింది.

ఇంగ్లాండ్‌దే రెండో టీ20




ఇంగ్లాండ్‌దే  రెండో టీ20 
          రాణించిన హేల్స్‌, బెయిర్‌స్టో 
                                      కార్డిఫ్‌ 





భారత్‌తో తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్‌ రెండో టీ20లో సత్తా చాటింది. హేల్స్‌ (58 నాటౌట్‌; 41 బంతుల్లో 4×4, 3×6) మెరిసిన వేళ టీమ్‌ఇండియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఆదివారం చివరి టీ20 మ్యాచ్‌ జరుగుతుంది.
ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన మోర్గాన్‌ సేన రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (47; 38 బంతుల్లో 1×4, 2×6), ధోని (32 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. హేల్స్‌, బెయిర్‌స్టో (28; 18 బంతుల్లో 2×6) మెరుపులతో ఇంగ్లాండ్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి రాగా.. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌ బాదిన హేల్స్‌ జట్టును విజయపథంలో నడిపించాడు.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టిపడేశారు. కార్డిఫ్‌ పిచ్‌పై బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో పాటు అదనపు బౌన్స్‌ కూడా ఉండడంతో పరుగుల కోసం ఆరంభంలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కష్టపడ్డారు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ (5), ధావన్‌ (10)తో పాటు తొలి మ్యాచ్‌లో సెంచరీ వీరుడు కేఎల్‌ రాహుల్‌ (6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. బాల్‌ బౌలింగ్‌లో బంతిని పుల్‌ చేయబోయి రోహిత్‌ ఔట్‌ కాగా.. ధావన్‌ చిత్రంగా రనౌట్‌ అయ్యాడు. ప్లంకెట్‌ బౌలింగ్‌ను బంతిని టచ్‌ చేసి పరుగుల కోసం ప్రయత్నించాడు శిఖర్‌. అయితే అవతలి ఎండ్‌లో క్రీజులోకి వెళ్లే క్రమంలో ధావన్‌ చేతిలో బ్యాట్‌ చేజారింది. ఈ స్థితిలో అతని కాలు గాల్లో ఉండడంతో రనౌట్‌గా వెనుదిరగక తప్పలేదు. అదే ఓవర్లో రాహుల్‌ బౌల్డ్‌ కావడంతో భారత్‌ 22/3తో కష్టాల్లో పడింది.
కోహ్లి.. రైనా జోడీగా: రైనా (27; 20 బంతుల్లో 2×4, 1×6) జోడీగా కోహ్లి భారత ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. వీలు చిక్కినప్పుడల్లా తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లు కొట్టిన విరాట్‌.. భారత రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. రషీద్‌ బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌లో రాయ్‌ క్యాచ్‌ వదిలేయడంతో జీవనదానం పొందిన అతను.. జోర్డాన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్‌ మీదగా కళ్లుచెదిరే సిక్స్‌ బాదాడు. రైనా ఔట్‌ కావడం, అర్ధసెంచరీకి చేరువైన విరాట్‌.. రూట్‌ పట్టిన మెరుపు క్యాచ్‌తో వెనుదిరగడంతో భారత్‌ 111/5తో నిలిచింది. ఆఖరి ఓవర్లో ధోని మూడు ఫోర్లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. దీంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్‌ ముగించింది.
భారత్‌: 148/5 (కోహ్లి 47, రైనా 27, ధోని 32 నాటౌట్‌, పాండ్య 12 నాటౌట్‌; విల్లీ 1/18, బాల్‌ 1/44, ప్లంకెట్‌ 1/17, రషీద్‌ 1/29)
ఇంగ్లాండ్‌: 19.4 ఓవర్లలో 149/5 (రాయ్‌ 15, బట్లర్‌ 14, హేల్స్‌ 58 నాటౌట్‌, బెయిర్‌స్టో 28; ఉమేశ్‌ 2/36, కుల్‌దీప్‌ 0/34, చాహల్‌ 1/28)

నేటి నుంచి ‘నీట్‌’ వెబ్‌ఆప్షన్లు


నేటి నుంచి ‘నీట్‌’ వెబ్‌ఆప్షన్లు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో 2018-19 సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో చేరికకు శనివారం నుంచి వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే ప్రవేశ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఒకటో ర్యాంకు నుంచి 5 వేల ర్యాంకుల వరకూ శనివారం(7న) ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకూ.. 5001వ ర్యాంకు నుంచి ఆఖరి ర్యాంకు వరకూ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10న మధ్యాహ్నం 2గంటల వరకూ వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ర్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన అభ్యర్థులంతా 10న ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకూ వెబ్‌ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. దివ్యాంగుల కోటా అభ్యరులు కూడా ఇవే తేదీల్లో తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుందని ఉపకులపతి తెలిపారు. క్రీడా, ఎన్‌సీసీ, సైనిక తదితర కోటాలవారికి సంబంధిత అధికారుల నుంచి ప్రాధాన్యత జాబితా వచ్చిన అనంతరం విడిగా వెబ్‌ఆప్షన్లకు ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. సీటు పొందిన తర్వాత అభ్యర్థి కేటాయించిన కళాశాల/ కోర్సులో చేరకపోతే తదుపరి ప్రవేశ ప్రక్రియకు అనర్హుడిగా ప్రకటిస్తారని వివరించారు.
9 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌
బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 9వ తేదీ నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. పదో తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కౌన్సెలింగ్‌ రుసుము కింద ఎస్‌సీ, ఎస్‌టీలు రూ.500, ఇతరులు రూ.800 చెల్లించాలి. ర్యాంకుల వారీగా ఏ రోజు, ఏ సమయానికి కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి? సహాయ కేంద్రాలు, కళాశాల రుసుము తదితర పూర్తి వివరాలకు edcetadm.tsche.ac.in, edcet.tsche.ac.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని కన్వీనర్‌ ఆచార్య మధుమతి తెలిపారు.

JANASENA NAYAKUDU PAWAN KALYAN

విశాఖ: విశాఖ రైల్వే జోన్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అప్పుడు జగన్, చంద్రబాబుతో కలిసి రైళ్లను స్తంభింపజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా తగరపువలసలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అంటే భయమని పవన్‌ అన్నారు. తనకు అలాంటి భయాలేవీ లేవని చెప్పారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ కేంద్రంతో పోరాడుతోంది జనసేన పార్టీ మాత్రమేనని అన్నారు.
భూ నిర్వాసితులతో భేటీ..
రాష్ట్రంలో భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర రైతుల తరహా ఉద్యమం అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ భూ నిర్వాసితులతో సమావేశమైన ఆయన రైతుల బాధలు తెలిసిన వాడిగా వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని తెలిపారు. ఆ మేరకు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి నుంచి ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటించారు. అమరావతి రాజధాని ప్రాంతం భూ నిర్వాసితులు, కాకినాడ సెజ్, పోలవరం ముంపు మండలాల్లోని రైతులు, పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ బాధిత రైతులు, వంశధార నిర్వాసితులు, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్వాసితులు, భావనపాడు పోర్టు బాధితులు, కొవ్వాడ అణువిద్యుత్ ప్రాంత రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

WhatsApp Reportedly Issues Fix for Chat Syncing Issue With Linked Devices

WhatsApp is reportedly implementing a security fix to address the issue where a user's chats across devices were not synced properly. Th...